జగనూ.. బాబు కూడా ఇలాగే చేశాడు అప్పట్లో.. కాస్త జాగ్రత్త..?

27

ఒకసారి అధికార పీఠం అధిరోహిస్తే.. సీన్ మారిపోతుంది. చుట్టూ భజనపరులు చేరతారు. అధికారులు ఆహో ఓహో అంటారు. ఏం చేసినా శెభాష్ అనేవారే తప్ప.. సద్విమర్శ చేసేవారే కనిపించరు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నవారికి అయిష్టమైన మాటలు చెప్పాలని ఎవరూ కోరుకోరు.

RRR

అలా ఓవైపు నాయకులు, మరోవైపు అధికారులు చేసే అతితో నాయకుడు తాను చేసేందే రైటు అనుకుంటాడు. క్రమంగా ప్రజలకు దూరమవుతాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. అవినీతి నిర్మూలనపై జగన్ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. అవినీతిపై ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కాల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరు ఫిర్యాదు చేసినా 15 నుంచి నెల రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఇది ఆచరణలో ఎంత వరకూ ఫలితాలు ఇస్తుందో చూడాలి.

ఎందుకంటే.. గతంలో చంద్రబాబు ఇలాగే చేశారు. 1100 నెంబర్ తో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం చకచకా అయిపోతోందని అధికారులు ఆయన్ను నమ్మించారు. ఆహా.. మన రాజ్యం సుభిక్షంగా ఉంది కదా అని ఆయన కూడా అనుకున్నాడు.

కానీ గ్రౌండ్ లో పరిస్థితి వేరుగా ఉంది. వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కాలేదు. అధికారులు అనేక కొర్రీలు వేసేవారు. చివరకు ఆ నెంబర్ ను ఆశ్రయించడం మానేశారు. ప్రజలకూ ఆ నెంబర్ పై విశ్వాసం పోయింది. ఇప్పుడు జగన్ కూడా ఆ అనుభవాన్ని పరిశీలించాలి.. చంద్రబాబు ఎక్కడ ఫెయిలయ్యాడో తెలుసుకోవాలి. తాను కూడా అలా కాకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే.. చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.