చైనాలో పిచ్చుకలను చంపితే… 4.5 కోట్ల మంది చనిపోయారు..!

103

అవి చైనాను మావో జెడాంగ్ పాలిస్తున్న రోజులు. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావో.. తన దేశాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టించాలని భావించాడు. అందుకోసం కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. దేశాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా తిరుగులేకుండా చేయాలని సంకల్పించాడు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెంచే క్రమంలో అందుకు ప్రతిబంధకంగా ఉన్న కీటకాలపై మావో యుద్ధం ప్రకటించాడు.

RRR

ప్రత్యేకించి ధాన్యాన్ని తింటూ నష్టం చేస్తున్నాయన్న కారణంగా పిచ్చుకలపై ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక పిచ్చుక ఒక సంవత్సరం లో సుమారు ఆరున్నర కిలోల బియ్యం తింటుందని మావో సూత్రీకరించారు. అలా దేశంలోని పిచ్చుకలన్నీ తింటున్న ధాన్యం లక్షల టన్నుల్లో ఉంటుందని వివరించాడు. ఆ ధాన్యం అంతా కాపాడితే అరవై వేల మంది జనాభాకి ఆహారం సమకూర్చవచ్చని దేశప్రజలకు నూరిపోశాడు. అంతే దేశమంతటా పిచ్చుకలపై మహా సంగ్రామం ప్రారంభమైంది.

జనం పిచ్చుకలు కనిపిస్తే చాలు చంపేసేవారు. అవి చెట్లపై వాలకుండా పెద్ద పెద్ద జెండాలు ఊపుతూ పాలద్రోలే వారు. చెట్లపైకెక్కి వాటి గూళ్లను.. వాటిలోని గుడ్లను నాశనం చేసేవారు. పిచ్చుక పిల్లలను సైతం చంపేసేవారు. అలా చైనాలో పిచ్చుకలే లేకుండా సర్వనాశనం చేశారు. ఎక్కువ పిచ్చుకలను చంపిన వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారంటే ఆ ఉన్మాదం ఏ స్థాయికి వెళ్లిందో ఊహించుకోవచ్చు.

అలా గొప్ప ముందడుగు పేరుతో ప్రారంభమైన పిచ్చుకల సంహారం ప్రపంచంలోనే అతి పెద్ద విషాదానికి దారి తీసిందంటారు ఫ్రాంక్ డికోటర్ అనే చరిత్ర కారుడు. మనుషులు చేసిన తప్పిదానికి అతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన తన “మావోస్‌ గ్రేట్ ఫామిన్ ” అనే పుస్తకంలో రాశారు. అవును మరి. మావో చేసిన ఆ పిచ్చుకలపై యుద్ధం కారణంగా చైనాను కరవు రక్కసి కబళించింది. అక్షరాలా నాలుగున్నర కోట్ల మంది మంది ఆకలితో అలమటించి అసువులు బాశారు.

అదేంటి..? పిచ్చుకలను చంపితే కరువు ఎందుకు వచ్చింది ? ఆ కరువులో నాలుగున్నర కోట్ల మంది చనిపోవడమేంటి ? అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం.
పిచ్చుకలు పొలాలపై వాలినప్పుడు కేవలం ధాన్యాన్ని మాత్రమే తినవు.. అవి పంటకు హానికరమైన అనేక పురుగులను కూడా తింటాయి. అంటే అవి పంటకు పరుగులను తినడం ద్వారా ఎంతో మేలు చేస్తున్నాయన్నమాట. మరి దేశంలో పిచ్చుకలే లేకుండా చంపేస్తే ఆ పురుగులను చంపేదెవరు..? క్రమంగా పంటలను చీడపీడలు పాడు చేశాయి. దేశంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కరవు కరాళ నృత్యం చేసింది. ఆకలి చావులకు దారి తీసింది.